Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమీర్‌పేట
ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో శుక్రవారం రూ.7 కోట్ల వజ్రాభరణాలున్న కారుతో పారిపోయిన డ్రైవర్ కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే మహిళా జ్యువెలరీ వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్(28) కారులో ఉన్న రూ.7 కోట్ల విలువచేసే వజ్రాభరణాలతో పరారయ్యాడు మధురానగర్‌కు చెందిన అనూషకు రూ.50 లక్షల విలువచేసే వజ్రాభరణాలను ఇచ్చేందుకు సేల్స్‌మెన్ అక్షయ్‌తో కలిసి వచ్చిన శ్రీనివాస్ నగలున్న కారుతో సహా పారిపోయాడు. ఈ తరుణంలో కేసు నమోదుచేసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు గాలింపు చేపట్టి శ్రీనివాస్ కారును ఎక్కడో వదిలి బైక్‌పై పరారవుతున్నట్లు గుర్తించారు. శ్రీశైలం రోడ్డు కడ్తాల్ వరకు బైక్‌పై శ్రీనివాస్ వెళ్లినట్లు గుర్తించారు.
అయితే ఇది పథకం ప్రకారమే జరిగినట్లుగా సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మూడు నెలల కిందట నగరానికి వచ్చిన శ్రీనివాస్ ఎస్సార్‌నగర్ సమీపంలోని సాయి హాస్టల్లో ఉంటున్నాడు. మూడు నెలల కిందటే రాధిక వద్ద పనిలో చేరాడు. నగరంలోని వివిధ నగల దుకాణం నుంచి వజ్రాభరణాలను కావాల్సిన వారికి రాధిక సరఫరా చేస్తుంటుంది. రోజూ కారులో పెద్దమొత్తంలో వజ్రాభరణాలు తరలిస్తుంటారు. ఈ విషయం గ్రహించిన శ్రీనివాస్ రెండు రోజుల ముందుగానే భార్యను బెంగళూరు పంపినట్లు పోలీసులు గుర్తించారు. తన ఇద్దరు కుమారులను సోదరుల వద్ద వదిలాడు.