Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మధిర పట్టణం
ఖమ్మం జిల్లా మధిరలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల బాలికల వసతిగృహంలో వంటలు సరిగా ఉండటం లేదంటూ విద్యార్థి సంఘం నాయకులకు చెప్పారనే కోపంతో సదరు విద్యార్థినులను ప్రిన్సిపల్ విచక్షణారహితంగా దండించారు. బాలికల కాళ్లకు వాతలు తేలి కమిలిపోయిన దృశ్యాల వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మధిర పురపాలికలోని ఓ ప్రయివేటు విద్యాసంస్థల ప్రాంగణంలో గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ హాస్టల్‌ను సందర్శించిన ఓ విద్యార్థి సంఘం నాయకుడికి విద్యార్థినులు తమ కష్టాలను తెలిపారు. అన్నం, కూరలు సరిగ్గా ఉండటం లేదని, కూరల్లో కారానికి బదులు ఎండుమిర్చి వేస్తుండటంతో కడుపులో మంట వస్తోందని ఫిర్యాదు చేశారు.
ఈ తరుణంలో విద్యార్థి సంఘం నాయకుడు ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. విద్యార్థినులను ఇబ్బందులు పెట్టవద్దని సూచించి వెళ్లారు. దీంతో ఆగ్రహానికి లోనైన సదరు ప్రిన్సిపల్ 20 మందికి పైగా బాలికలను ఓ గదిలోకి పిలిచి కర్రతో తీవ్రంగా కొట్టడంతో వాతలు తేలాయి. కొందరికి కొట్టినచోట కమిలిపోయి గాయాలయ్యాయి.