Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ రేపోమాపో దివాలా తీయనుందని అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ కార్యక్రమంలో అది ఎప్పుడో జరిగిపోయిందని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ స్వయంగా అన్నారు. దీనికి ఆ దేశ వ్యవస్థలు, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులే కారణమన్నారు.
పాకిస్థాన్ సంక్షోభంలోకి కూరుకుపోతోందని లేదా దివాలా అంచుకు చేరిందని మీరు వినే ఉంటారు. నిజానికి అది (దివాలా) ఎప్పుడో జరిగిపోయింది. మనమిప్పుడు ఓ దివాలా తీసిన దేశంలో ఉన్నాం’’ అని కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశిస్తూ ఖవాజా ప్రసంగించారు. దీనికి పరిష్కారం దేశంలోనే ఉందన్నారు. అంతే కాకుండా పాకిస్థాన్లో చట్టం, రాజ్యాంగాన్ని ఎవరూ అనుసరించడం లేదని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి దేశ రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, వ్యవస్థలే కారణమని తెలిపారు. తన జీవితంలో అత్యధిక సమయం ప్రతిపక్షంలోనే గడిపానని, 32 ఏళ్లుగా రాజకీయాలు ఎలా భ్రష్టుపడుతున్నాయో ప్రత్యక్షంగా చూశానని వ్యాఖ్యానించారు.