Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం
కేరళలోని త్రిసూర్‌లో కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న తండ్రికి అతడి కుమార్తె తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చింది. దీంతో దేశంలో అతిపిన్న అవయవ దాతగా ఆమెగా కీర్తి పొందింది. 48 ఏళ్ల ప్రతీష్ ఒక కేఫ్ నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల కిందట అతడి ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యానికి గురి కావడంతో పలు వైద్య పరీక్షలు చేశారు.
ఈ తరుణంలో ప్రతీష్ లివర్ దెబ్బతినడంతోపాటు క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. దీంతో కాలేయం దాత కోసం అతడి కుటుంబం చాలా ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోవడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు కుమార్తె దేవానంద ముందుకు వచ్చింది. 17 ఏళ్ల వయస్సున్న ఆమె 12వ తరగతి చదువుతున్నది. మానవ అవయవ మార్పిడి చట్టం 1994 ప్రకారం మైనర్లు తమ అవయవాలను దానం చేయడానికి నిబంధనలు అనుమతించవు. అయితే ఇలాంటి ఒక కేసులో మైనర్ అవయవ దానానికి కోర్టు అనుమతించిన సంగతిని దేవానంద తెలుసుకుంది. దీంతో కేరళ హైకోర్టును ఆమె ఆశ్రయించింది. తన తండ్రి ఆరోగ్యం కోసం కుమార్తె చేస్తున్న ప్రయత్నాలను కోర్టు కూడా ప్రశంసించింది. ఆమె కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించింది.