Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్
ఆ ప్రేమ జంటకు కులాలు వేరైనప్పటికీ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు ఆత్మహత్యకు ఒడిగట్టగా తోడుగా ఉండవలసిన వాడే దూరం అవుతున్నడన్న బాధతో ప్రియురాలు సైతం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దొనబండ గ్రామపంచాయతీకి చెందిన నాగవెళ్లి శ్రీకాంత్ (24) ఆటో నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. అదే గ్రామానికి చెందిన నరెడ్ల సంఘవి (21), శ్రీకాంత్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. కులాలు వేరైనప్పటికీ వివాహం జరిపించేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్థిక సమస్యలతో అప్పులు పెరగడంతో శ్రీకాంత్ మనస్తాపానికి గురై ఈ నెల 17న సాయంత్రం గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టు దారిలోని పోచమ్మ గుడి వద్ద పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు సంఘవి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వీరిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా శనివారం సాయంత్రం శ్రీకాంత్, రాత్రి సంఘవి మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు.