Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలు, వినియోగంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో నూతన మద్యం విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కొత్త విధానానికి ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గుతుందన్నారు.
ఈ కొత్త విధానం కింద రాష్ట్రంలో అన్ని బార్ షాపులు, అహాటాలు(మద్యం దుకాణాల వద్ద ఉండే సిట్టింగ్ ప్రాంతాలు) మూసివేయనున్నట్లు మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. లిక్కర్ షాపుల్లో మద్యం విక్రయాలు మాత్రమే కొనసాగుతాయని, కూర్చుని మద్యం తాగేందుకు అనుమతినివ్వబోమని వెల్లడించారు. ఇక, విద్యాసంస్థలు, గర్ల్స్ హాస్టళ్లు, ప్రార్థనా ప్రదేశాలకు 100 మీటర్లలోపు మద్యం దుకాణాలకు అనుమతి లేదన్నారు. ఇక మద్యం తాగి వాహనాలు నడిపే కేసుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేలా కొత్త విధానంలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు.