Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో సుమారు 40 వేల మంది గ్రామ పంచాయితీ కార్మికులు పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సప్లై, కారోబార్, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులు నిర్వహిస్తున్నారు. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు చెందిన పేదలే. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీరు నిరాదరణకు గురవుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరి వేతనాలను రూ.8500లకు పెంచినా, ఆ పెంపు శాస్త్రీయ పద్ధతిలో లేదు. 2023లోని జనాభా, పంచాయితీ విస్తరణకనుగుణంగా వీరు సేవలందిస్తున్నారు. కానీ 2011 జనాభాను మాత్రమే లెక్కలోకి తీసుకొని 500 జనాభాకు ఒక కార్మికుడిగా పరిగణించారు. క్షేత్రస్థాయిలో గ్రామ అవసరాల ప్రాతిపదిక మీద పంచాయితీ పాలకవర్గం మరికొంత కార్మికులను నియమించుకున్నది. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ పెంచిన వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి మాత్రమే వస్తున్న వేతనాలను అందరూ పంచుకుంటున్నారు. దీంతో అత్యధిక మంది కార్మికులకు రూ.3500ల నుండి రూ.4500ల వరకు మాత్రమే వస్తున్నాయి. వేతనాలు పెంచామనే సాకుతో వివిధ కేటగిరీలను రద్దు చేసి మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొస్తూ ప్రభుత్వం 51 జీవోను తెచ్చింది. దీంతో కార్మికులకు పని భారం పెరిగింది. కారోబార్తో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, ట్రాక్టర్స్ డ్రైవర్, చివరికి ప్రజా ప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత పనులను కూడా చేయించుకుంటున్నారు. వేతనాలు కూడా 4నుండి 7 నెలల వరకు బకాయిలుగా ఉన్నాయి. దీంతో కార్మికులు అప్పులపాలై ఇబ్బందులు పడ్తున్నారు. గ్రామ పంచాయితీ ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ Ê వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 12 నుండి పాదయాత్ర జరుగుతున్నది. జీఓ నెం.60 గ్రామపంచాయితీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ, పారిశుద్ధ్య కార్మికులకు రూ.15600లు, కారోబార్, బిల్కలెక్టర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సప్లై కార్మికులకు రూ.19500లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ విభాగంలో పనిచేసే సిబ్బందికి రూ.22750ల వేతనం చెల్లించాలని, యాక్ట్ 2/94ను రద్దు చేసి పంచాయితీ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి వారిని అసిస్టెంట్ పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలని, జీఓ నంబర్ 51ని సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, పంచాయితీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలని, పంచాయితీ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మరియు ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5,50,000లు ఆర్ధిక సహాయం చేయాలని, ఇప్పటికే మల్టీపర్పస్ వర్కర్ విధి నిర్వహణలో ప్రమాదానికి గురై డ్యూటీ చేయలేని స్థితిలో ఉన్న వారి మరియు మరణించిన వారి కుటుంబ సభ్యులకు పంచాయితీల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలని, దళితబంధును ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని పాదయాత్ర బృందం కోరుతున్నది. ఇవి గొంతెమ్మ కోర్కెలు కావు. కావున వీరి న్యాయమైన సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.