Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన రాఘవను ఈడీ 10 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం విధితమే. నేటితో కస్టడీ గడువు ముగియడంతో రాఘవకు రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 4వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు రాఘవను తిహాడ్ జైలుకు తరలించారు.
సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర ఉందని, ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణ సందర్భంగా గతంలో ఈడీ వాదనలు వినిపించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, తదుపరి విచారణ కోసం నింధితుడిని కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ వాదనకు సానూకులంగా స్పందించిన కోర్టు 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. గుంట రాఘవకు తయారీ, హోల్‌సేల్ వ్యాపారం, 2 రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయని విచారణ సందర్భంగా ఈడీ కోర్టుకు వివరించింది. రూ.వంద కోట్ల ముడుపుల్లో రాఘవ కీలకంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, విజయ్‌నాయర్, అభిషేక్, సమీర్, అమిత్ అరోరా, బినోయ్ అరెస్టు అయ్యారని పేర్కొంది. శరత్‌రెడ్డితో రాఘవకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ముడుపుల సమీకరణలో సమీర్ మహేంద్రు కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవకూ భాగస్వామ్యం ఉందని.. దీని నుంచి ఆయనకు వాటా వెళ్తోందని కూడా కోర్టుకు తెలిపింది. మద్యం విధానంతో లబ్ధి పొందేందుకు ముడుపులు ఇచ్చారని.. ఈ ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని కోర్టుకు వివరించింది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో వివరాలు పొందుపరిచామని కోర్టుకు తెలిపింది. సుమారు 30 మంది సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని వివరించింది.