Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్ దేవ్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా కారును పక్కకు తప్పించడంతో విప్లవ్ దేవ్ ప్రాణాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. దాంతో ఎంపీ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. హర్యానా రాష్ట్రం పానిపట్‌లోని జీటీ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఎంపీ విప్లవ్ దేవ్ కార్యాలయం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన పానిపట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీజేపీ హర్యానా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బిప్లబ్ దేబ్ ఢిల్లీ నుంచి చండీగఢ్ వైపు వెళ్తుండగా సమల్ఖా ఉ పానిపట్ మధ్య రోడ్డుపై ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సమల్ఖా) తెలిపారు. టైరు పంక్చర్ కావడంతో జీటీ రోడ్డులో ఓ కారు ఆగింది. వెనుక నుంచి వస్తున్న దేబ్ వాహనం ఆగి ఉన్న కారును ఢీకొట్టిందని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. మార్చి 9, 2018న త్రిపుర 10వ ముఖ్యమంత్రిగా బిప్లబ్ దేబ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, తర్వాత మే 14, 2022న ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. మే 15న త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు.