Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన విద్యార్థులకు సకాలంలో అందని వైద్యం
- ఆరోగ్య కార్యకర్తల తొలగింపుతో సమస్య జఠిలం
నవతెలంగాణ పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మృత్యుఘోష వినిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్య కార్యకర్తలను తొలగించిన ఫలితంగా సమస్య జఠిలమైంది. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబాన్ని విడిచిపెట్టి ఆశ్రమాల్లో విద్యాభ్యాసం కోసం వస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారని, సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, రంపచోడవరం డివిజన్లలో గత నవంబర్ నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది అనారోగ్యంతో మృతి చెందారు. రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలం ముసినిగుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని పి.యమునశ్రీ ఈ నెల 16న, ఇదే పాఠశాల పదో తరగతి విద్యార్థిని కానెం ఈశ్వరిదేవి ఈ నెల తొమ్మిదిన అనారోగ్యంతో మృతి చెందారు. పాడేరు డివిజన్ జి.మాడుగుల మండలం బంధవీధి ఆశ్రమ బాలికల పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని కొర్ర కవిత ఈ నెల 17న, పాడేరు గురుకుల పాఠశాల ఇంటర్ విద్యార్థిని హారిక గత నవంబర్లోనూ మరణించారు. పాడేరు నెంబర్ వన్ పాఠశాల ఏడో తరగతి విద్యార్థి పాంగి నవీన్, జి.మాడుగుల గురుకుల పాఠశాల విద్యార్థి కొండబాబు, పాడేరులోని తలారిసింగి సిఎహెచ్ స్కూలు విద్యార్థి ఒకరు అనారోగ్యానికి గురై మృతి చెందారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 15 రోజుల్లో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. వారిలో సీతంపేట మండలం పూతికవలస గిరిజన బాలికల వసతి గృహ పదో తరగతి విద్యార్థిని కొండగొర్రి పవిత్ర, కొమరాడ మండలం ఉలిపిరి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని సుమిత్ర, మక్కువ కెజిబివి పాఠశాల ఇంటర్మీడియట్ విద్యార్థిని కొండగొర్రి యోగీశ్వరి ఉన్నారు. ఇవన్నీ రికార్డుల్లోకి ఎక్కిన మరణాలు. రికార్డులు ఎక్కని మరణాలు ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చని గిరిజనులు అంటున్నారు.