Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. అత్తాపూర్ ఔట్‌పోస్ట్ ఎస్సై కిషన్‌జీ తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్(35)కు ఇద్దరు ఆడపిల్లలు. అతడు ఓ ఫర్నీచర్ షాప్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం అహ్మద్ భార్య కాన్పు కోసం కర్ణాటకలోని తన పుట్టింటికి వెళ్లింది. మరోమారు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో.. మనస్తాపానికి గురైన అహ్మద్ కొన్ని రోజులుగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.