Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పోలీస్ స్టేషన్ లోనే టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను హింసించారని ఆయన సతీమణి చందన ఆరోపించారు. తోట్లవల్లూరు స్టేషన్ లో తన భర్తను ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి కొట్టారని చెప్పారు. పోలీసులను అందరనీ బయటికి పంపించి ఈ దాడి చేశారని అన్నారు. దీనికి డీజీపీ ఏం చెప్తారని నిలదీశారు. తన భర్తకు ఏమైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ రోజు తన నివాసంలో మీడియాతో పట్టాభి సతీమణి చందన మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసుల సహకారంతోనే తన భర్తపై దాడి జరిగిందని, హింసించారని అన్నారు. 'సేఫ్ గా తీసుకెళ్తామని చెప్పి జీప్ ఎక్కించుకుని, పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. ఈ రోజు కొడతారు.. రేపు విషం ఇచ్చినా ఇస్తారు. ఇంజక్షన్ ఇచ్చి ఏమైనా చేయొచ్చు' అని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులను ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
నా భర్తకు ప్రాణహాని ఉందని ముందు నుంచీ మొత్తుకుంటున్నా. ఇప్పుడు కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కు తరలిస్తామని చెబుతారు. అక్కడ రిమాండ్ లో ఏమైనా చేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. తన భర్తకు ఏమైనా జరిగితే ఊరుకోబోమని, డీజీపీ ఆఫీసు ముందు ఆత్మహత్యమ చేసుకుంటానని చందన హెచ్చరించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసులు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. పట్టాభి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు, టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పట్టాభిని ఈ మధ్యాహ్నం గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.