Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: కంపెనీలకు ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలను అందించే ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీ అండ్ కంపెనీ కూడా ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. సుమారు 2,000 మందిని తొలగించేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిబ్బందిని తగ్గించుకునే క్రమంలో ఈ తొలగింపును చేపడుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. తమ క్లయింట్లతో నేరుగా సంబంధం ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రాజెక్ట్ మాగ్నోలియా ప్రణాళిక ప్రకారం... ఉద్యోగులపై వేటు భాగస్వామ్యులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహక బృందం యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే వారాల్లో తొలగింపుల ప్రణాళికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. 2012లో మెకెన్సీలో 17,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఐదేళ్ల క్రితం నాటికి ఆ సంఖ్య 28,000కు చేరింది. ఇప్పుడు అది 45,000గా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే 2021లో కంపెనీ ఆదాయం 15 బిలియన్ డాలర్లుగా నమోదైందని, గతేడాది ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉందని అన్నారు. అయితే ఖాతాదారులతో నేరుగా సంప్రదింపులు జరిపే నిపుణుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని కంపెనీ ప్రతినిధి డిజె. కారెల్లా ఓ ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి సంస్థలతో పాటు జొమాటో వంటి దేశీయ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.