Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: పెండ్లి అయిన రెండురోజులకే కొత్త జంట రక్తపు మడుగులో పడి కనిపించింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఇంకొన్ని గంటల్లో పెళ్లి రిసెప్షన్ ఉందనగా.. నూతన జంట విగత జీవులుగా పడి ఉన్న వారి శరీరాలపై కత్తిపోట్లు కనిపించాయి. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రిసెప్షన్‌కు ముందు నూతన వధూవరుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. వరుడే ఆమెను హత్య చేసి.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్లాం(24), కహ్కషా బానో(24)కు ఆదివారం బ్రిజ్‌నగర్‌లో వీరి పెండ్లి జరిగింది. రిసెప్షన్‌ను మంగళవారం రాత్రి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నూతన దంపతులు ముస్తాబయ్యేందుకు ఓ గదిలోకి వెళ్లారు. కాసేపటికే వధువు అరుపులు వినిపించడంతో.. వరుడి తల్లి అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఆ గదికి లోపటి నుంచి గడియ పెట్టి ఉంది. కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా.. నూతన జంట రక్తపు మడుగులో పడి కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు.
పోలీసులు గది తలుపు బద్దలు కొట్టి.. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గదిలో నుంచి రక్తపు మరకలతో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రిసెప్షన్‌కు ముందు దంపతుల మధ్య ఏదో విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కోపంతో వరుడు వధువుపై కత్తితో దాడి చేసి, అనంతరం తనకు తాను కత్తితో పొడుచుకొని చనిపోయాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.