Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో హానికరమైన ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య యత్నం చేసిన వైద్య విద్యార్థిని హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆమెను వరంగల్ ఎంజీఎం నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరించారు. ఐదు గంటలు గడిస్తే కాని ఆమె పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారని ఆమె తండ్రి నరేంద్ర తెలిపారు.
‘‘గతేడాది నవంబర్ నుంచి ఆమెను సీనియర్ విద్యార్థి వేధిస్తున్నాడు. ఇదే అంశంపై కేఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తన కుమార్తె తెల్ల వారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ర్యాగింగ్‌ను వ్యతిరేకించింది. తోటి విద్యార్థుల మద్దతు కోరింది. రెండేండ్లు ఇక్కడే పనిచేయాల్సి ఉండటంతో వారు బయపడి వెనకడుగు వేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో 5 గంటలు గడిస్తే కాని స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ర్యాంగింగ్కు పాల్పడిన విద్యార్థిపై, కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. దీంతో వైద్య విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తండ్రి నరేంద్ర ఆర్పీఎఫ్ వరంగల్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం హైదరాబాద్ లో నివాసముంటోంది. విద్యార్థిని 3 నెలల క్రితం కేఎంసీలో అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరంలో చేరారు. నిన్న రాత్రి చివరి సారిగా ఆమె తన సోదరుడితో మాట్లాడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.