Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపించాయి. మన దేశంలో కూడా అప్పుడప్పుడు.. అక్కడక్కడా భూప్రకంపనలు చోటుచేసుకొంటుంటాయి. అయితే రిక్టర్ స్కేల్‌పై వాటి తీవ్రత తక్కువగా నమోదవుతుండటంతో పెద్దగా ప్రభావం ఉండటం లేదు. అయితే ఎప్పటికీ ఇలానే ఉంటుందని అనుకోవడానికి లేదని, భారత భూగర్భంలో చోటుచేసుకొంటున్న పలు మార్పుల కారణంగా భవిష్యత్తులో భారత్ లో కూడా ప్రధానంగా హిమాలయాల సమీప ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత భూభాగ పైపొరల్లోని టెక్టోనిక్ ప్లేట్లు ప్రతి ఏడాది 5 సెంటీమీటర్ల మేర కదులుతున్నాయని, ఇది హిమాలయాల వెంబడి ఒత్తిడికి దారితీస్తున్నదని, తద్వారా రాబోవు రోజుల్లో హిమాలయ పర్వతాల సమీప ప్రాంతాల్లో భారీ భూకంప ఘటనలు సంభవించే ప్రమాదాన్ని పెంచుతున్నదని హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన చీఫ్ సైంటిస్టు, భూకంప శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడారు. భూఉపరితలం అనేక ప్లేట్లు కలిగి ఉంటుందని, అవి నిత్యం తిరుగుతూ ఉంటాయని తెలిపారు. హిమాలయ పర్వతాలకు సమీపంలో ఉండే హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పశ్చిమ నేపాల్ ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు.