Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తమిళనాడు
ఏఐడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఉంటారని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే పార్టీపై తన అధిపత్యాన్ని నిలుపుకోవడానికి పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
అయితే గత ఏడాది జూలై 11న జరిగిన అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంలో ఎడప్పాడి పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక చెల్లదంటూ పన్నీర్‌సెల్వం, జనరల్ కమిటీ సభ్యుడు వైరముత్తు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసులో ఈ ఎన్నిక చెల్లదని తీర్పు తెలిపారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ పళనిస్వామి వర్గం హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆ తరుణంలో కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సింగిల్ జడ్డి తీర్పుపై స్టే విధిస్తూ పళని స్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో దీనిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయంతో అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది.