Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమయింది. సీనియర్ రాజకీయవేత్త, కాపు సామాజికవర్గంలో బలమైన నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు కూడా టీడీపీలో చేరారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు 3 వేల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. అంతకు ముందు గుంటూరులోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ వాహన ర్యాలీతో పార్టీ ఆఫీసుకు వచ్చారు.
రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారం నచ్చక కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కన్నా చేరికతో టీడీపీ మరింత బలపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం కన్నాతో పాటు వచ్చిన నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పార్టీ కండువాలు కప్పుతూ, ఆహ్వానిస్తున్నారు.