Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ గ్రూప్-3 పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గురువారం ముగిసింది. ఇప్పటి వరకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో 1,375 గ్రూప్-3 పోస్టులకు టీఎస్పీఎస్సీ డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 24న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొదట.. 1,363 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. తర్వాత ప్రభుత్వం మరో 12 పోస్టులను కలిపింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచింది. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటనలో పేర్కొనగా.. తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టులు 38కి చేరాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనుండగా.. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేయనున్నది.