Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
వరంగల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిపై దొంగలు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వరంగల్ లోని సుందరయ్యనగర్ లో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు జాగిలపు ఐలమ్మ(70)ను దొంగలు కొట్టి ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లారు. తీవ్ర గాయాల పాలైన ఐలమ్మ అక్కడికక్కడే చనిపోయింది.
శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి ఎనుమాముల పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త చనిపోవడంతో ఆమె ఇంట్లో ఒకరే ఉంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలోనూ ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు రూ.3 లక్షల విలువ చేసే బంగారం నగలను అపహరించారు. ఈ గ్రామానికి పొరుగున ఉన్న చలపర్తి గ్రామ శివారులో ఉన్న ఓ ఇంట్లో కూడా చొరబడేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇద్దరు గేటు దూకి ఆవరణలోకి చేరుకున్నారు.ఇంటి యజమాని అప్రమత్తం కావడంతో దుండగులు పారిపోయారు. సమీపంలో ఓ ఇంటి ఎదుట ఉన్న మోటార్ సైకిల్ ను ఎత్తుకెళ్లారు. వరుస ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.