Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్: వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ దిశానిర్దేశం చేశారు. బస్టాండ్‌ల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు, కూలర్లు, బెంచిలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవిలో ప్రయాణికులకు ఏర్పాట్లు, సంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్‌లోని బస్ భవన్ నుంచి ఆర్ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఆన్లైన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిర్దేశించారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే కాలం టీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలన్నారు. సంస్థ ఆర్థిక పుష్టికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించడమే తమ ప్రధాన విధి అనే విషయం మరిచిపోవద్దని చెప్పారు.