Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్.. తమ సేవలను భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవలే 470 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలతో భారీ డీల్ కుదుర్చుకున్న ఆ సంస్థ.. తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగులనూ నియమించుకునేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది కేబిన్ సిబ్బంది, పైలట్లు కలుపుకొని మొత్తం 5,100 మందిని నియమించుకోబోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. విమానాలు ఆర్డర్ ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. దేశీయ సేవలతో పాటు అంతర్జాతీయంగానూ సేవలను విస్తరిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించినట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందులో భాగంగా 4,200 మంది ట్రైనీ కేబిన్ సిబ్బందిని, 900 మంది పైలట్లను నియమించుకోనున్నట్లు తెలిపింది. కేబినెట్ సిబ్బందికి 15 వారాల శిక్షణ ఉంటుందని ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ తెలిపారు. శిక్షణా కాలంలో భద్రత, సేవలు, దేశ ఆతిథ్యం, టాటా గ్రూప్ సంస్కృతిపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
గతేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం 1900 మంది కేబిన్ సిబ్బందిని నియమించుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది. జులై-జనవరి మధ్య 7 నెలల్లో 1100 మందికి శిక్షణ ఇచ్చామని, అందులో 500 మందిని సేవలకు వినియోగించుకుంటున్నామని పేర్కొంది. ప్రస్తుతం ఎయిరిండియా 113 విమానాలు నడుపుతోంది. మొత్తం 1600 మంది పైలట్లు పనిచేస్తున్నారు. మరోవైపు ఇటీవలే 36 విమానాలను లీజుకు తీసుకునేందుకు ఎయిరిండియా నిర్ణయించింది. అందులో 2 విమానాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.