Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినులను అసభ్యంగా తాకుతూ వేధించడం ప్రారంభించారు. నలుగురు ఉపాధ్యాయులు, పాఠశాల బస్సు డ్రైవర్ ఇలా ప్రవర్తిస్తుండడంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం పాఠశాలకు చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై దాడికి యత్నించారు. ఒక దశలో పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. స్థానిక ఎస్సై ఝాన్సీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉపాధ్యాయులు, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మరిపెడ సీఐ సాగర్ తెలిపారు. అంతకుముందు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు, జిల్లా ఛైల్డ్లైన్ విభాగం, ఐసీడీఎస్ అధికారులు పాఠశాలను సందర్శించి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు.