Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంకారా: ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. భూకంపం వల్ల ఇప్పటివరకు రెండు దేశాల్లో కలిపి 50 వేల మందికిపైగా మరణించారు. ఒక్క తుర్కియేలోనే 44,218 మంది మృతిచెందారని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఇక సిరియాలో 5,914 మంది మరణించారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో ఈ నెల 6న వచ్చిన పెను భూకంపానికి అర లక్షకుపైగా జనాలు ప్రాణాలు కోల్పోయినట్లయింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 1,60,000 భవనాలు, 5,20,000 అపార్టుమెంట్లు ధ్వంసమవడం లేదా దెబ్బతినడం జరిగిందని ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి.
కాగా, దేశంలో 2 లక్షల అపార్టుమెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 70 వేల ఇండ్లు నిర్మించాలని ఎర్డోగాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 15 బియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనావేశామని అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. అయితే కూలిన ఇండ్లను మళ్లీ నిర్మించడంతోపాటు వసతులు కల్పించాలంటే 25 బిలియన్ డాలర్ల ఖర్చవుతుందని అమెరికా బ్యాంకు జేపీ మోర్గాన్ వెల్లడించింది. కాగా, భూకంపం వచ్చిన ప్రాంతాల్లో 1.5 మిలియన్ల (15 లక్షలు) మంది నిరాశ్రయులు అయ్యారని, వారికోసం 5 లక్షల ఆవాసాలను నిర్మించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్డీపీ అంచనావేసింది.