Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వ్యాయామశాలలో కసరత్తు చేస్తూ ఒక యువ కానిస్టేబుల్ తీవ్ర గుండెపోటుతో కుప్పకూలి సెకన్ల వ్యవధిలోనే కన్నుమూశాడు. ఈ అనూహ్య ఘటన సికింద్రాబాద్ పరిధి మారేడ్‌పల్లిలో చోటుచేసుకుంది. మోండామార్కెట్ ఆదెయ్యనగర్కు చెందిన ధరంప్రకాష్, కల్పన దంపతులకు ధరంవిశాల్(24), ఓ కుమార్తె ఉన్నారు. తల్లి గృహిణి, తండ్రి వాచ్‌మ్యాన్. విశాల్ డిగ్రీ వరకూ చదివి 2020 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆసిఫ్‌నగర్ ఠాణాలో విధుల్లో చేరాడు. ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఇటీవల మారేడుపల్లిలోని జిమ్‌సెంటర్‌లో చేరాడు. 2-3 వారాలుగా అక్కడ కసరత్తు చేస్తున్నాడు. ఎప్పటిలాగే ధరంవిశాల్ గురువారం రాత్రి 7.30 గంటలకు జిమ్‌కు వెళ్లాడు. వామ్అప్స్ పూర్తయ్యాక 23 సెకన్లలో అతి వేగంగా 21 పుషప్స్ చేశాడు. ఆపై నీరసించి ట్రెడ్మిల్ రాడ్‌ను పట్టుకున్నాడు.. ఒక్కసారిగా కిందపడిపోయి గిలగిలా కొట్టుకున్నాడు. ఇదంతా 72 సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయింది. జిమ్ నిర్వాహకులు 108 సిబ్బందికి సమాచారమిచ్చి, ఆలోపు ప్రథమచికిత్స చేశారు. అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ధరంవిశాల్ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు జిమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మితిమీరిన వ్యాయామ ప్రభావంతో హృదయస్పందన విపరీతంగా పెరిగి తీవ్రమైన గుండెపోటుతో విశాల్ మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు పోలీసు అధికారులకు చెప్పినట్లు సమాచారం. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ నేతాజీ తెలిపారు.