Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్గొండ
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ తన స్నేహితుడికి దక్కుతుందోనన్న అనుమానంతో పార్టీ పేరుతో పిలిచి దారుణంగా కొట్టి చంపాడు. పోలిసుల వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్(20) నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో ఏడాది చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న హరి, నవీన్ స్నేహితులు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడంతో కొన్నాళ్లుగా ఇద్దరికీ భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో ఈ నెల 17న ఉదయం పార్టీ చేసుకుందామని హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని తన స్నేహితుడి రూమ్‌కు నేనావత్ నవీన్‌ను హరి ఆహ్వానించాడు. నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్ రాకపోవడంతో ఈ నెల 22న అతని తండ్రి శంకరయ్య నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీఐ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నార్కట్‌పల్లి ఎస్సై రామకృష్ణ ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులను విచారించారు. ఈ నెల 22న సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో వారి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి వాకబు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. తన ప్రియురాలిని ఎక్కడ దక్కించుకుంటాడనే అసూయతోనే విచక్షణారహితంగా కొట్టి హత్య చేశానని, మృతదేహాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ శివారులోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పడేశానని నిందితుడు హరి పోలీసులకు తెలిపినట్లు సమాచారం.