Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ : స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్ ఫైటర్ జెట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చేరుకున్నాయి. విదేశాల్లో నిర్వహించనున్న వాయు విన్యాసాల్లో తొలిసారి ఇవి పాల్గోనున్నాయి. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఈ మేరకు శనివారం తెలిపింది. మల్టీ లేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్లో పాల్గొనేందుకు ఐదు తేజస్ యుద్ధ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్మాస్టార్-III విమానాలు యూఏఈలోని అల్ దహ్ఫ్రా ఎయిర్‌బేస్‌కు చేరినట్లు పేర్కొంది. అక్కడ నిర్వహించే డిసర్ట్ ఫ్లాగ్ 8 విన్యాసాల్లో ఇవి పాల్గొంటాయని వెల్లడించింది. తేజస్ యుద్ధ విమానాలు తొలిసారి విదేశీ వాయు విన్యాసాల్లో పాల్గొంటున్నాయని తెలిపింది.
కాగా, ఎక్సర్సైజ్ డిసర్ట్ ఫ్లాగ్ అనేది బహుపాక్షిక వైమానిక విన్యాసం. యూఏఈ, భారత్‌తోపాటు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కువైట్, బహ్రెయిన్, మొరాకో, స్పెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన వైమానిక దళాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ నెల 27 నుంచి మార్చి 17 వరకు ఈ ఎయిర్ ఎక్సర్సైజ్ జరుగనున్నది. వివిధ దేశాలకు చెందిన యుద్ధ విమానాలు కలిసికట్టుగా విన్యాసాల్లో పాల్గొనడం, వైమానిక దళాల సామర్థ్యాన్ని చాటడం, కొత్త వ్యూహాలు నేర్చుకోవడం ఎడారి వాయు విన్యాసాల లక్ష్యమని ఐఏఎఫ్ పేర్కొంది.