Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పట్నా
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనంతరం శనివారం ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ తన తొలి ప్రసంగం చేశారు. బిహార్‌లోని పూర్నియాలో నిర్వహించిన మహాగఠ్‌బంధన్ ర్యాలీని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ తరుణంలో దేశంలోని బలహీనవర్గాలు, మైనారిటీలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వ్యతిరేకమని విమర్శించారు. తమ కూటమి 2024 లోక్‌సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీను తుడిచిపెట్టేస్తుందన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను అంతం చేసేందుకు యత్నిస్తున్నాయని లాలూ ఈ సందర్భంగా ఆరోపించారు. ‘మా పోరాటం ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే. సంఘ్ సూచనలనే బీజేపీ పాటిస్తోంది అని వ్యాఖ్యానించారు. బీజేపీను అధికారం నుంచి తొలగించేందుకు బిహార్ చొరవ తీసుకుందని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ బీజేపీ గల్లంతవుతుందన్నారు.