Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనల్లో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గంలోని వేలేరు మండలం షోడశపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి సహ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్యనాయకులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి ఎర్రబెల్లి ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించారు. షోడశపల్లి బహిరంగసభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బాధ్యులకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభ సాధించిన విజయం కంటే షోడశపల్లి సభ మరింత గొప్పగా నిర్వహించాలని గులాబీ శ్రేణులు పట్టుదలతో ఉన్నాయి.