Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే కసాయివాడిగా మారి భార్యను, ఇద్దరు పిల్లల్ని అత్యంత పాశవికంగా చంపాడు. ఆ ఇద్దరు పిల్లల్లో నాలుగు నెలల శిశువు కూడా ఉన్నాడు. భార్య, పిల్లల్ని కడతేర్చిన అనంతరం నిందితుడు మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స ఇవ్వడంతో బతికి బయటపడ్డాడు. నిందితుడిని 38 ఏళ్ల రాజేష్‌గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడు తన ఆర్థిక ఇబ్బందుల గురించి మిత్రులకు తెల్లవారుజామున మెసేజ్ చేశాడని, వారు వెంటనే అతని సోదరుడిని అప్రమత్తం చేయడంతో ఉదయం 6 గంటల ప్రాంతంలో తమకు సమాచారం ఇచ్చాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ద్వారక) ఎం.హర్షవర్ధన్ తెలిపారు. నిందితుడి తల్లిదండ్రులు ఇద్దరికీ 75 ఏళ్లు ఉంటాయని, ఘటన జరిగిన సమయంలో ఆ ఇద్దరూ వేరే గదిలో ఉన్నారని, ప్రస్తుతం ఆ కుటుంబ పరిస్థితిలు, సంఘటనకు దారితీసిన కారణాలపై వారిని ఆరా తీస్తున్నామని చెప్పారు. ''మేము ఘటనా స్థలికి చేరుకునే సమయానికి నిందితుడితో పాటు మూడు మృతదేహాలు గదలో కనిపించాయి. రాజేష్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. భారీగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్టు నిందితుడు తన మిత్రులకు సమాచారం ఇచ్చాడు. అతనిపై మోహన్ గార్డెన్ పీఎస్‌లో హత్య కేసు నమోదు చేశాం. తదుపరి దర్యా్ప్తు సాగిస్తున్నాం'' అని హర్షవర్దన్ తెలిపారు. కాగా, నిందితుడు రాజేష్ కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. దీనికి ముందు ఐఎస్ఓ సర్టిఫికేషన్‌కు సంబంధించిన పనులు చేసేందుకు ఒక కంపెనీని నడిపేవాడు.