Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుజరాత్
అహ్మదాబాద్లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ క్రికెటర్ మైదానంలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం అతడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
అహ్మదాబాద్ సమీపంలోని భదాజ్లోని డెంటల్ కాలేజీ ప్లేగ్రౌండ్లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జీఎస్టీ ఉద్యోగి అయిన వసంత్ రాథోడ్ (34) ఫీల్డింగ్ చేస్తూ గ్రౌండ్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అప్పటికే అతని ప్రాణాలు పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై జీఎస్టీ విభాగం సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ఆ మ్యాచ్లో వసంత్ మొదట్లో చాలా యాక్టివ్గానే కనిపించాడు. బౌలింగ్ వేసే సమయంలోనూ బాగానే ఉన్నాడు. అయితే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో, అతడు కింద పడిపోయాడు. ఏం జరిగిందోనని మేమంతా ఆందోళన చెందాం. మొదట్లో స్పృహ కోల్పోయి పడిపోయాడేమోనని భావించాం. ఎలాంటి కదలికలు లేకపోవడంతో సహచరులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆలోపే అతడు మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు’’ అని చెప్పుకొచ్చారు.