Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేప్‌టౌన్
మహిళల వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి సత్తాచాటింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ మహిళలు 19 పరుగుల తేడాతో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. దీంతో వరుసగా మూడోసారి కూడా మెగా ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టేసింది. 2018, 2020 టీ20 వరల్డ్‌కప్‌లను కూడా ఆస్ట్రేలియా మహిళలు గెలుచుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
ఓపెనర్ మూనీ(74 నాటౌట్; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, గార్చర్(29; 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. హీలే(18), గ్రేస్ హారిస్(10), కెప్టెన్ లానింగ్(10)లు విఫలం అయ్యారు. కానీ మూనీ సొగసైన ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచకల్గింది. ఆపై 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 17 పరుగుల వద్ద టాజ్మిన్ బ్రిటిస్(10) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం దక్షిణాఫ్రికా వికెట్లను కాపాడుకునే యత్నంలో మెల్లగా ఆడింది. దాంతో రన్‌రేట్ పెరిగిపోయి చివరకు ఓటమి పాలైంది. 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసిన సఫారీలు అ తరువాత తేరుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ లౌరా(61; 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయింది. దక్షిణాఫ్రికా 137 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.