Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అహ్మదాబాద్
గుజరాత్ లోని వల్సాద్ జిల్లా సరిగామ్లో ఉన్న ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సరిగామ్లోని జీఐడీసీ వైనే పెట్రోకెమ్ అండ్ ఫార్మా ఇండియా కంపెనీకి చెందిన మూడంతుస్తుల బిల్డింగ్లో రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్రమంగా కంపెనీ మొత్తానికి వ్యాపించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో బిల్డింగ్ కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ తరుణంలో రెండు మృతదేహాలను వెలికితీశామని, మరొకటి లభించాల్సి ఉందని వల్సాద్ ఎస్పీ విజయ్ సింగ్ గుర్జార్ తెలిపారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.