Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ వరంగల్: వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ మానసికంగా వేధించాడని బుధవారం కాకతీయ మెడికల్ కళాశాలలో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించింది. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.మోహన్‌దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 13 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సాగిన సమావేశంలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు జరిగిన పరిణామాలపై చర్చించారు. ప్రీతికి కౌన్సిలింగ్ ఇచ్చిన వైద్యులెవరు? సైఫ్‌తో కలిసి ప్రీతి ఎన్నిసార్లు రాత్రి విధులు నిర్వహించింది? ప్రీతి, సైఫ్‌కు మధ్య విభేదాలు రావడానికి గల కారణాలపై చర్చ జరిగింది. గతేడాది నవంబర్ 18న అడ్మిషన్ పొందిన ప్రీతికి, సీనియర్ విద్యార్థి సైఫ్‌కు భేదాభిప్రాయాలు ఎందుకొచ్చాయన్న అంశాలపై ప్రధానంగా కమిటీ చర్చించింది.
ప్రీతిపై సీనియర్ విద్యార్థి సైఫ్.. పీజీ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేస్తూ ఆమెను కించపర్చేవిధంగా పోస్టింగ్‌లు పెట్టినట్టు కూడా కమిటీ నిర్ధారించింది. జీఎంహెచ్ ఆసుపత్రిలో ప్రీవెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన వాగ్వాదం ఒక్కటే వీరి మధ్య వివాదానికి కారణం కాదని కమిటీ తేల్చి చెప్పింది. ప్రీతి, సైఫ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన అనస్థీషియా వైద్య విభాగం హెచ్‌వోడి నాగార్జునరెడ్డిని కూడా కమిటీ విచారించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైఫ్ తనను టార్గెట్ చేస్తూ వేధించాడని ప్రీతి ఆయన దృష్టికి తీసుకువచ్చినట్టు అంగీకరించాడు. దీంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు నాగార్జున్‌రెడ్డి కమిటీకి తెలిపారు. ఆ తర్వాత కూడా ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించినట్టు కమిటీ తెలిపింది. ఇది ర్యాగింగ్ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఈ నివేదికను ఢిల్లీలోని యూజీసీతో పాటు ఎన్ఎంసీకి కూడా అందజేయనున్నట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డా.మోహన్‌దాస్ తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఆర్డీవో వాసుచంద్ర, వరంగల్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ బోనాల కిషన్, అసోసియేట్ ప్రొఫెసర్ దామోదరి బాయ్, కేఎంసీ వైస్ ప్రిన్సిపల్ రాజ్ డేవిడ్, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ రజా మాలిఖాన్, పీజీ విద్యార్థి శ్రీకాంత్, దివ్యారెడ్డి, దీప్తిమయి పాల్గొన్నారు.