Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి తరగతి గదిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి మంగళవారం రాత్రి స్టడీ అవర్ ముగియగానే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాత్విక్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బుధవారం ఉదయమే మృతుని తల్లిదండ్రులు, బంధువులు, పలు విద్యార్థి సంఘాలు నార్సింగిలోని కళాశాల వద్ద ఆందోళనకు దిగాయి.
సూసైడ్‌నోట్..
కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి స్వాతిక్ జేబులో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు.
‘‘ అమ్మా నాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపల్, ఇన్‌ఛార్జి, లెక్చరర్ల వల్లే చనిపోతున్నా. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. ఈ నలుగురు హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఆ నలుగురిని వదిలిపెట్టొద్దు.. చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్’’ అని సాత్విక్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో వైపు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు ముట్టడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్ధి నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యలను ఇంటర్ బోర్డు పట్టించుకోవట్లేదని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు.