Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ఆ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా కుంగగా.. తాజాగా ఆ గ్రూప్‌నకు చెందిన 10 కంపెనీల షేర్లూ గురువారం నాటి ట్రేడింగ్‌లో లాభాల్లో ముగిశాయి. ఇటీవల ఇన్వెస్టర్ రోడ్‌షోలు నిర్వహించడం, కనిష్ఠాల వద్ద అదానీ షేర్లను బ్లాక్ డీల్ ద్వారా సంస్థాగత మదుపర్లు కొనుగోలు చేశారన్న వార్తలు సెంటిమెంటును బలపరిచాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 4.99 శాతం, అదానీ విల్మర్ 4.99 శాతం, అదానీ పవర్ 4.98 శాతం చొప్పున రాణించాయి. ఎన్డీటీవీ 4.96 శాతం, అంబుజా సిమెంట్ 4.94, అదానీ టోటల్ గ్యాస్ 4.41 శాతం, అదానీ పోర్ట్స్ 3.50 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 2.69 శాతం, ఏసీసీ 1.50 శాతం చొప్పున రాణించాయి. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి అదానీ గ్రూప్ 10 కంపెనీల మార్కెట్ విలువ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది. గడిచిన రెండు ట్రేడింగ్ సెషన్లలలోనే మార్కెట్ విలువ ఏకంగా రూ.74,302.47 కోట్లు మేర పెరగడం గమనార్హం.