Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మేడ్చల్
జిల్లాలో దూలపల్లిలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. హరీశ్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం దూలపల్లికి వచ్చి ఇల్లు కట్టుకొని తన తల్లితో ఇక్కడే నివాసం ఉంటున్నాడు. గతంలో అతను ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో వేరే వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయంలో యువతి తల్లిదండ్రులు హరీశ్‌ను హెచ్చరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే, నివాసం మార్చినప్పటికీ యువతితో ప్రేమను కొనసాగించడమే కాకుండా కొంత కాలం తర్వాత యువతిని వివాహం చేసుకున్నాడు.
ఈ తరుణంలో నలుగురు యువకులు హరీశ్‌ను కత్తులతో పొడిచి చంపినట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. మొదటగా గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా దూలపల్లికి చెందిన హరీశ్‌గా గుర్తించారు. వేరే వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకే తన కుమారుడిని యువతి కుటుంబసభ్యులు హత్య చేశారని ఆరోపిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా యువతి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారే హరీశ్‌ను హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత యువతిని వారి వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. హరీశ్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.