Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్కాట్లాండ్
స్కాట్లాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యావరణాన్ని కలుషితం చేసే డిసల్ఫూరేన్ అనే వాయువు పై నిషేధం విధించింది. దాంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ అనస్థీషియా గ్యాస్‌ను బ్యాన్ చేసిన తొలి దేశంగా గుర్తింపు సాధించింది. సర్జరీల సమయంలో డాక్టర్లు రోగులకు మత్తు ఇవ్వడం కోసం డిసల్ఫూరేన్ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. ఇది కార్బన్డయాక్సైడ్ కంటే చాలా ప్రమాదకరమైనది. అవును.. ఈ గ్యాస్ 2,500 రెట్లు ఎక్కువగా భూతాపానికి కారణమవుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకని స్కాట్లాండ్ ప్రభుత్వం ఈ ప్రమాదకరమైన గ్యాస్‌ను నిషేధించింది.
‘యునైటెడ్ కింగ్డమ్లో డిసల్ఫూరేన్పై నిషేధం విధించిన తొలి దేశం స్కాట్లాండ్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. వైద్య, ఆరోగ్య రంగంలో వ్యర్థాలను తగ్గించడానికి, పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే.. అదే సమయంలో రోగుల ప్రాణాలను కాపాడడం కూడా ముఖ్యమే’ అని స్కాట్లాండ్ వైద్య ఆరోగ్య శాఖ సెక్రెటరీ హంజా యూసఫ్ తెలిపాడు. ఇకనుంచి ఆ దేశంలోని జాతీయ ఆరోగ్య కేంద్రాలలో డిసల్ఫూరేన్ వాడకంపై నిషేధం అమలులోకి రానుంది.