Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇండోనేషియా
ఇండోనేషియా రాజధాని జకార్తలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జకార్తాలో ఉన్న ఓ చమురు డిపోలో పేలుడు సంభవించింది. దీంతో 16 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 50 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా సమీపంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పెర్టమినా ఆయిల్ డిపో ఉన్నది. అందులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 37 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 180 మంది ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతోపాటు పిడులు పడటంతో మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అది పేలుళ్లకు కారణమైందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు.
కాగా, ఇదే చమురు డిపోలో 2009లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 ఇండ్లు కాలి బూడిదయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక 2021లో పశ్చిమ జావాలోని బాలొన్గాన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.