Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వికారాబాద్
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పూడూరు మండలం చిలాపూర్ గ్రామ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్ కొట్టిన దెబ్బలవల్ల సాత్విక్ అనే ఏడో తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. అయితే, స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థి సాత్విక్‌ను ఏ టీచర్ కొట్టలేదని అంటోంది. ఆ విద్యార్థి హాస్టల్ బెడ్‌పై నుంచి పడిపోవటంవల్ల చేతికి గాయమైందని చెబుతోంది.
మొయినాబాద్ మండలం, పెద్ద మంగళారం గ్రామానికి చెందిన సాత్విక్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చుదువుతున్నాడు. ఈ తరుణంలో ఫిబ్రవరి 23న సాత్విక్ చేతికి గాయమైంది. అయితే, స్కూల్ యాజమాన్యం సాత్విక్ తల్లిదండ్రులకు చెప్పకుండా స్కూల్ యాజమాన్యమే రెండు, మూడు రోజులు ట్రీట్మెంట్ చేసింది. అయినా గాయం మానకపోవడంతో ఫిబ్రవరి 26న సాత్విక్ పేరెంట్స్‌కు విషయం తెలిపింది. దాంతో ఫిబ్రవరి 27న సాత్విక్ తల్లిదండ్రులు కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌కు వెళ్లి బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే గాయం తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సాత్విక్‌ను పరిశీలించి చేతికి శస్త్రచికిత్స చేశారు. అయితే, సర్జరీ జరిగిన గంటసేపటికే బాలుడు మరణించాడు. దాంతో స్కూల్లో టీచర్ కొట్టడంతోనే తమ కుమారుడు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయాడని బాలుడి తల్లిదండ్రులు చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.