Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తూర్పుగోదావరి
తెలుగు దేశం పార్టీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వరుపుల రాజా హఠాన్మరణం చెందారు. శనివారం వరుపుల రాజాకు గుండెపోటు రావడంతో హుటాహుటిన కాకినాడ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ వరుపుల రాజా మృతి చెందారు. వరుపుల రాజా మృతి పట్ల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో రాజా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. రాజా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజునే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే, 23 రోజులు చికిత్స పొందుతూ తారకరత్న మరణించారు. తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ శ్రేణులకు.. పార్టీ సీనియర్ నేత వరుపుల రాజా గుండెపోటుతో హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది.