Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసున్న వారిలో గుండె పోటు కనిపించేది.కానీ ఇప్పుడు పాతికేళ్ల యువకులు కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో యాక్టివ్‌గా కనిపించిన వారు కూడా.. ఉన్నపళంగా చనిపోతున్నారు. తెలంగాణలో కూడా గుండె పోటు మరణాలు పెరగడంతో మంత్రి గంగుల కమలాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరగకుండా ఉండేందుకు... జిల్లాలోని ప్రతి కళాశాలలో నిర్బంద వైద్యపరీక్షలను నిర్వహించడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ వెల్లడించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, ఐఎంఏ అసోసియేషన్, ఫార్మసి అసోసియేషన్, వైద్యాదికారులు కార్టియాలజిస్టులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... చిన్న వయసున్న వారు కూడా గుండెపోటుకు గురై చనిపోవడం బాధాకరమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడతామని చెప్పారు. కరీంనగర్ నగరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేలా ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య పరీక్షల కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాలోని అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు నిర్బంద గుండె పరీక్షలు చేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈసిజి, రక్తపరీక్ష వంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఐఎంఏ, డయోగ్నోస్టిక్ నిర్వహాకులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. జిల్లాలో పోలీస్, మున్సిపల్ సిబ్బందికి సీపీఆర్‌పై ప్రత్యేకశిక్షణ ఇస్తామని.. గుండెపోటుకు గురైన వారిని ప్రాణాలను కాపాడేలా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. నిర్బంధ వైద్య పరీక్షల ద్వారా.. అనారోగ్యంగా ఉన్న వారిని ముందస్తుగా గుర్తించవచ్చని.. తద్వారా కొంత మందినైనా బతికించవచ్చని మంత్రి అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, నగర మేయర్ వై. సునీల్ రావు, అడిషన్ కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, జెట్పీ సిఈఓ ప్రియాంక, ట్రైని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఇతర అధికారులు, డాక్టర్లు, ఐఎంఎ ప్రతినిధులు పాల్గొన్నారు.