Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఎయిరిండియా మూత్రవిసర్జన వివాదం ఇంకా మరువక ముందే అదే తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చుకున్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. ఏఏ292 నంబర్‌తో ఉన్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ విమానం శుక్రవారం న్యూయార్క్ నుంచి రాత్రి 9:16 గంటలకు బయలుదేరింది. దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది.
నిందితుడు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి. తమకు అందిన ఫిర్యాదు ప్రకారం.. మూత్రం పోసిన సమయంలో అతడు తాగిన మైకంతో నిద్రిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ విమానాశ్రయ అధికారి తెలిపారు. ఆ మూత్రం పక్కనే ఉన్న తనపై పడ్డట్లు తోటి ప్రయాణికుడు వెంటనే విమాన సిబ్బందికి తెలియజేశాడు. అయితే, బాధితుడు మాత్రం దీన్ని పోలీసుల వరకు తీసుకెళ్లాలని భావించలేదని సమాచారం. నిందితుడు క్షమాపణలు చెప్పడంతో పాటు ఇది వివాదంగా మారితే తన కెరీర్‌కే ముప్పని ప్రాధేపడ్డట్లు తెలుస్తోంది. కానీ, విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని వెంటనే పైలట్ ద్వారా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ’ దృష్టికి తీసుకెళ్లారు.
ఏటీసీ అధికారులు సీఐఎస్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ కాగానే నిందితుణ్ని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇరుపక్షాల వాదనలు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ఏ ప్రయాణికుడైనా దురుసుగా ప్రవర్తించినట్లు తేలితే క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అలాగే నిర్ణీత సమయం పాటు విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తారు.