Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రియదర్శి, కావ్య కల్యాణ్ ప్రధాన పాత్రధారులుగా జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన 'బలగం' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా కథపై వివాదం నెలకొంది. 'బలగం' చిత్ర కథ తనదే అని, తాను 2011లో ఈ కథ రాసుకున్నానని గడ్డం సతీష్ అనే పాత్రికేయుడు వెల్లడించాడు. 'పచ్చికి' అనే పేరుతో తన కథ 'నమస్తే తెలంగాణ' దినపత్రికలోనూ వచ్చిందని వివరించాడు. ఆ కథ ద్వారానే తనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఉద్యోగం లభించిందని తెలిపాడు. 'బలగం' చిత్రం టైటిల్స్ లో తన పేరు వేయాల్సిందేనని డిమాండ్ చేశాడు. దీనిపై 'బలగం' దర్శకుడు వేణు స్పందించాడు. ఈ సినిమా కథపై ఓ జర్నలిస్టు వివాదం సృష్టించడం హాస్యాస్పదంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో 'కాకి ముట్టుడు' అనే సంప్రదాయాన్ని చూపించామని, ఇది తెలంగాణకే పరిమితం కాదని, తెలుగు వారందరి సంప్రదాయని వెల్లడించారు. 'ఆయనెవరో సతీష్ అంట... ఆయనెవరో నాకు తెలియదు. ఆయన కథ నేను చదవలేదు. 'కాకి ముట్టుడు' అనేది చరిత్ర తెలుగు వారందరికీ ఇచ్చిన సంప్రదాయం. ఇది ఎవరి సొత్తూ కాదు. దీనిపై ఎవరైనా స్పందించవచ్చు. ఇది నాది అంటే ఎలా? చావుపై అనేక భాషల్లో అనేక చిత్రాలు వచ్చాయి. ఆయన న్యాయపరంగా వెళతాం అని చెబుతున్నాడు... సంతోషంగా వెళ్లమని చెబుతున్నాం. చట్టం ఏం చెబితే అది చేస్తాం. ఈ విషయంలో ఏదైనా ఉంటే నాతో చూసుకోండి.. దిల్ రాజు గారిని ఇందులోకి లాగొద్దు. ఆయన నిర్మాత మాత్రమే. ఈ సినిమాకు దర్శకుడ్ని, రచయితను నేను. దిల్ రాజును లాగితే నేను ఒప్పుకోను. మీకంత దమ్ము, ధైర్యం ఉంటే మంచి కథ తీసుకుని దిల్ రాజు వద్దకు వెళ్లండి... ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కదా అని వేణు పేర్కొన్నారు.