Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి: నార్సింగీ కోకాపేటలో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. రెండు గ్యాంగులు అక్కడకు చేరుకుని ఓ స్థలం విషయంలో వాగ్వాదానికి దిగాయి. రెండు గంటల సమయంలో ఓ స్థలం వద్ద ఓ వర్గం భారీ కంటైనర్ ఏర్పాటు చేసింది. గ్యాంగ్ సభ్యులు సైతం అక్కడే తిష్ట వేశారు. ఆ స్థలం తమదంటూ అక్కడికి మరో వర్గం చేరుకుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. స్థలం మాదంటే మాదంటూ వాగ్వివాదానికి దిగాయి. ఇరు వర్గాలు పలు ప్రాంతాల నుంచి రౌడీలను రప్పించి రంగంలోకి దింపాయి. నాలుగు గంటల పాటు కోకాపేటలో ఇరు వర్గాలు తమ వర్గానికి చెందిన రౌడీలతో హల్ చల్ చేశాయి. ఓ వర్గం 100కు ఫోన్ చేసింది. అయినా పోలీసులు పత్తా లేకుండా పోయారు. పదుల సంఖ్యలో 100 డయల్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. స్థలం వద్దకు వస్తే చంపుతామంటూ ఇరు వర్గాలు వార్నింగ్స్ ఇచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే ఓ వర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. ల్యాండ్ వైపు కూడా తిరిగి చూడలేదు. దీంతో అర్ధరాత్రి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భూమి రేట్లు పెరగడంతో భూ బకాసురులు రెచ్చి పోతున్నారు. ఈ ల్యాండ్‌పై ఓ మంత్రి కన్ను వేశాడంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. అందుకే పోలీసులు సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. ఫోన్ చేసినా.. లేదంటే స్వయంగా వెళ్లినా కూడా పోలీసులు పట్టించుకోలేదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది.