Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చిన్న వయసులోనే తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అబ్బాయి కానీ, అమ్మాయి కానీ చిన్నప్పుడే వేధింపులకు గురైతే అది వాళ్లను జీవితాంతం వెంటాడుతుందని అన్నారు. తన భార్యాపిల్లల్ని చిత్రహింసలకు గురిచేయడం, కుమార్తెపై వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల తన తల్లి చాలా ఇబ్బందులు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 8 సంవత్సరాల పిన్న వయసులోనే తాను వేధింపులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వమున్న తన తల్లి, తనపై జరుగుతున్న వేధింపుల గురించి చెబితే నమ్ముతుందో, లేదోనని భయపడేదానినని అన్నారు. ఆ తర్వాత 15 ఏళ్ల వయసులో తండ్రికి ఎదురు తిరగడం మొదలుపెట్టానని, తనకు 16 ఏళ్లు రాకముందే ఆయన తమను వదిలిపెట్టి వెళ్లిపోయారని ఖుష్బూ గుర్తు చేసుకున్నారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పారు.