Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్: ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన పూజితా రెడ్డి(24) అనే వైద్య విద్యార్థిని గుండెపోటుతో చనిపోయారు.. ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన మల్కాపూర్(ఏ)కు సోమవారం తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ ఉప సర్పంచి వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు అరుణ్‌రెడ్డి, భరత్‌రెడ్డి, ఓ కుమార్తె పూజితారెడ్డి ఉన్నారు. పెద్ద కొడుకు కెనడాలో స్థిరపడ్డారు. పూజితారెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేశారు. పీజీ చేసేందుకు జనవరి 26న కెనడా వెళ్లారు. సోదరుడు అరుణ్‌రెడ్డి ఇంట్లో వారం ఉండి, అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్లో చేరారు. పది రోజుల కిందట గుండెపోటుకు గురై హాస్టల్ గదిలో కుప్పకూలారు. స్నేహితులు, సిబ్బంది దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యార్థిని మృతదేహాన్ని సోదరుడు స్వగ్రామానికి తీసుకురాగా.. అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి కన్నుమూసిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.