Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 20 వేల మంది మహిళలు హాజరుకానున్నారు. సభకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సభావేదిక నుంచి కేటీఆర్ ఆడబిడ్డలకు సర్కారు కానుకను అందించనున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ లేని రుణాల కోసం ప్రభుత్వం 750 కోట్ల రూపాయలను ప్రకటించింది. ఈ క్రమంలో పాలకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మహిళా సంఘాలకు వీటికి సంబంధించిన చెక్కులను అందజేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన అభయహస్తం పథకానికి చెందిన 545 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన తీపికబురు చెప్పే అవకాశముంది. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వెయ్యి మంది మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు ఆయన వరంగల్ జిల్లా పర్యతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు.