Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాట్నా
బీహార్లోని గయా జిల్లాలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వెలుపల ఒక మోర్టార్ షెల్ పడింది. అది పేలడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. బారచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గులార్వేడ్ గ్రామం పరిధిలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఉంది. అయితే బుధవారం తెల్లవారుజామున ఆ ఫైరింగ్ రేంజ్ బయట ఒక మోర్టార్ షెల్ పడింది. అది పేలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఆరుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని అనుగ్రహ నారాయణ్ మగద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు గ్రామస్తులు మరణించారు. కాగా, మోర్టార్ షెల్ పేలుడు వల్ల తీవ్రంగా గాయపడి మరణించిన ముగ్గురు గ్రామస్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో మహిళతోపాటు ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు గయా ఎస్పీ ఆశిష్ భారతి తెలిపారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వెలుపల మోర్టార్ షెల్ ఎలా పడి పేలింది అన్న దానిపై పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించారు.