Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగానే ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఢిల్లీలోని విజయ్ పార్క్‌లోని ఈ భవనం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టింది. సకాలంలో భవంతిలోని వారిని ఖాళీ చేయడంతో ఎవరూ ఈ ఘటనలో మృతి చెందలేదని అధికారులు తెలిపారు. సాయిబాబా ఆలయంలో సమీపంలోని విజయ్ పార్క్ ఏరియాలో భవంతి కుప్పకూలినట్టు మధ్యా్హ్నం 3 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చినట్టు డీఎస్ఎశ్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం భవంతి క్రింది ఫ్లోర్లో ఒక వాచ్ షాపు, మొదటి ఫ్లోర్లో ఒక మొబైల్ షాపు, రెండో అంతస్తులో ఒక కుటుంబం ఉంటోంది. బుధవారం ఉదయం నుంచి ఇంటిలోని టైల్స్ రాలిపడుతుండటం, వాల్ సీలింగ్ కూలడంతో భవంతినిలోని అందర్నీ వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా, 20 గజాల స్థలంలో నిర్మించిన ఈ భవంతి శిథిలావస్థలో ఉన్నట్టు కార్పొరేషన్ మాజీ కౌన్సిలర్ తెలిపారు. భవంతి కుప్పకూలిపోతుండగా స్థానికుడొకరు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.